బిడ్డ పుట్టగానే ప్రసవవేదనను మరిచిపోయి.. ఆ శిశువు తన పొత్తిళ్లలోకి తీసుకుని తల్లి మురిసిపోతుంది. ఇది ఏ తల్లికైనా ఎంతో మధుర క్షణం. కానీ, ఓ మాతృమూర్తి మాత్రం పుట్టిన తన బిడ్డను చూడటానికి 42 ఏళ్లు పాటు నిరీక్షించాల్సి వచ్చింది. భూమ్మీద పడిన వెంటనే తనకు దూరమైన బిడ్డ.. చనిపోయాడనుకుంది ఆ తల్లి. కానీ, 42 సంవత్సరాల తర్వాత తన చెంతకు చేరడంతో ఆ తల్లి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఓవైపు తల్లి ప్రేమ ఉప్పొంగితే.. అమ్మను చూసిన ఆ కొడుకు సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. సినిమాను తలపించే అత్యంత మధురమైన దృశ్యం చిలీలో ఆవిష్కృతమైంది. అమెరికాలోని వర్జీనియా నుంచి చిలీలోని వల్దీవియాలోని తల్లి ఇంటికి భార్యాపిల్లలతో కలిసి చేరుకున్న ఆ కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు.
