తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాను గతంలో అప్సర ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆదివారం బయటపడింది. ఈ మేరకు ఆమె భర్తతో ఉన్న ఫొటోలు కూడా బయటకు లీక్ అయ్యాయి. భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్‌కు అప్సర కుటుంబం వచ్చినట్లు తేలింది.

తాజాగా అప్సర హత్య నేపథ్యంలో కార్తీక్ రాజా తల్లి విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారింది. అప్సర వేధింపులు తట్టుకోలేక తన కుమారుడు కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ధనలక్ష్మి ఆడియోలో పేర్కొంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే తన కుమారుడిని అప్సరతో పాటు ఆమె తల్లి అరుణ మానసికంగా వేధించారని ధనలక్ష్మి ఆరోపించింది. లగ్జరీగా ఉండాలని, టూర్లకు తీసుకెళ్లాలని అప్సర, అరుణ బాగా వేధించారని, కేసులు పెట్టి జైల్లో కూడా వేయించినట్లు తెలిపింది. దీంతో అవమానాన్ని తట్టుకోలేక.. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆవేదనకు గురై తన కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లు తల్లి ధనలక్ష్మి చెబుతోంది.
కార్తీక్‌తో రోజూ భార్య అప్సరతో పాటు అత్త అరుణ గొడవలు పడేవారని, దీంతో అతడు మానసికంగా కృంగిపోయాడని ధనలక్ష్మి ఆడియోలో స్పష్టం చేసింది. తన కుమారుడి చావుకు వారిద్దరే అసలు కారణమని తెలిపింది. తన కుమారుడు చనిపోయిన తర్వాత వారిద్దరూ కనిపించలేదని, మీడియాలో వచ్చే వార్తలు చూసి ఇప్పుడు అప్సర హత్య గురైనట్లు తెలుసుకున్నానని ఆడియోలో చెప్పుకొచ్చింది. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తనకు ఇప్పటివరకు తెలియదంది. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక బాగా ఉండేదని, దానికోసమే హైదరాబాద్ వెళ్లినట్లు తాను అనుకుంటున్నట్లు ధనలక్ష్మి పేర్కొంది.
