మహిళా ప్రాణాల్నే కాపాడిన జవాన్ ఒక్కసారిగా డాక్టర్లు షాక్

Spread the love

బతికి ఉన్నన్నాళ్లూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఓ జవాన్.. తాను మరణించిన తర్వాత కూడా ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. ఆయన గుండెను మరో సైనికుడి భార్యకు అమర్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో సైనికుడి నుంచి సేకరించిన గుండెను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF)కు చెందిన ప్రత్యేక విమానంలో ఎయిర్ లిఫ్ట్ చేశారు. పూణే (మహారాష్ట్ర) లోని ఆర్మీ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఈ గుండెను అమర్చారు. పూణేలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్ (AICTS) వైద్యుల బృందం అనారోగ్యంతో ఉన్న సైనికుడి భార్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను (Heart Transplantation) విజయవంతంగా నిర్వహించింది.

40 ఏళ్ల ఆర్మీ వెటరన్‌ ఒకరు ఫిబ్రవరి 8న స్వస్థలానికి వస్తూ.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఆయణ్ని ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. వైద్యులు ఆయన గుండెను సేకరించి, భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పూణేకు తరలించారు.

గుండెను తరలించేందుకు IAF వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ సహాయంతో ‘గ్రీన్ కారిడార్’ ఏర్పాటు చేశారు. పూణే ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంతో సదరన్ కమాండ్ ప్రొవోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 4 గంటల వ్యవధిలోనే గుండెను రవాణా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

సైనికుడి ప్రాణం కాపాడిన యువకుడి గుండె


రెండు వారాల వ్యవధిలో ఇది ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్ చేసిన రెండో గుండె మార్పిడి శస్త్రచికిత్స. పూణేలోని AICTS లో ఇప్పటివరకు ఈ తరహా శస్త్రచికిత్స ఇది మూడోది కావడం విశేషం.

జనవరి 30న AICTS డాక్టర్లు.. గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 53 ఏళ్ల సైనికుడికి గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ జఠరిక వైఫల్యంతో ఆయన గుండె సంబంధిత రుగ్మత ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి నుంచి ఆ గుండెను సేకరించారు. రోడ్డు ప్రమాదంలో మెదడుకు గాయం కావడంతో ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి నుంచి గుండెను సేకరించి ఐఏఎఫ్ విమానంలో ఎయిర్‌లిఫ్ట్ చేసి సైనికుడికి అమర్చారు.