Krishna Mukunda Murari Today: గౌతమ్, నందినీల విషయంలో కృష్ణ సాహసించింది. నేటికి ఈ సీరియల్ 117 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే గౌతమ్‌ని ఇంటికి పిలవడం తెలిసిందే. దాంతో భవానీ, ఈశ్వర్, ప్రసాద్‌లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కృష్ణ.. భవానీ దగ్గర నిలబడి.. ‘నందు విషయంలో నాదే తప్పు అని నిరూపించడంలో ఆ ముకుంద గెలిచింది. కానీ.. ఈ రోజు నా తప్పు లేదని నిరూపించుకోవడానికి మా సీనియర్ డాక్టర్ గౌతమ్ సార్‌ని పిలిచాను.. ఆయనే భోజనానికి వస్తున్నారు అత్తయ్యా’ అంటుంది. ముకుంద, మురారీ కూడా అప్పుడే మెట్లు దిగుతూ ఉంటారు. ఈశ్వర్, ప్రసాద్, మధుకర్, అలేఖ్య, రేవతి, సుమలత అంతా అక్కడే ఉంటారు. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది.

కృష్ణ పరుగున వెళ్లి.. కారు దగ్గర నిలబడి.. రండి గౌతమ్ సార్ అనగానే గౌతమ్ కిందకు దిగుతాడు. గౌతమ్‌ని చూడగానే భవానీ కళ్లజోడు తిని.. షాక్ అయినట్లుగా పైకి లేస్తుంది. ఈశ్వర్ ప్రసాద్‌లు కూడా షాక్ అయిపోతారు. కృష్ణ కూల్‌గా ‘రండి సార్ రండి’ అంటూ పిలుస్తూ గుమ్మందాకా తీసుకొస్తుంది. వెంటనే గౌతమ్ భవానీ వైపు చూస్తూ నవ్వుతూ.. కుడికాలు పెడతాడు. గౌతమ్ కాలు పెట్టగానే.. ఆడుకుంటున్న నందుకి ఏదో తెలిసినట్లుగా.. గుండెల్లో గుబులుగా అనిపిస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక భవానీ కోపంగా చూస్తుంటే.. ఈశ్వర్, ప్రసాద్‌లు కోపంగా కొట్టడానికి అన్నట్లుగా ముందుకు వెళ్తారు. ఊ.. అంటూ గర్డిస్తుంది భవానీ. ఆగిపోతారు ఈశ్వర్ ప్రసాద్‌లు. దాంతో ముకుందకు అనుమానం వస్తుంది.

‘అతడ్ని చూసి వీళ్లెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అనుకుంటుంది. ఇక మొత్తానికీ గౌతమ్ లోపలికి రాగానే… కృష్ణ ఒక్కొక్కరినీ పరిచయం చేస్తుంటే.. ‘లేదు లేదు నేనే గెస్ చేస్తాను’ అంటూ.. అత్తయ్యగారు అంటాడు భవానీ వైపు చూస్తూ. ‘అదే మీ పెద్ద అత్తయ్యగారు కదా.. ముకుంద.. మధుకర్, రేవతి అత్తయ్యా.. ఈశ్వర్ మామ, ప్రసాద్ మామ.. అంటూ అందరి పేర్లు చెప్పి.. ‘మీ అందరి గురించి కృష్ణ ప్రతి రోజు చెబుతూ ఉంటుంది. నన్ను కలవాలని మొన్న కృష్ణ గంట టైమ్ అడిగితే బాధపెట్టారట కదా? అది కూడా చెప్పి బాధపడింది. బావగారు’ అంటాడు మురారీతో. మురారీ షాక్ అవుతాడు. ‘కృష్ణమ్మ నాకు సొంత చెల్లెలు కంటే ఎక్కువ.. అందుకే మీరు నాకు బావగారు’ అంటాడు గౌతమ్ నవ్వుతూ. ఇక మాటల సందర్భంలో.. ‘నందిని విషయంలో కృష్ణ తప్పేం లేదు.. నేను ఆ టాబ్లెట్ ఇచ్చాను.. వందల్లో ఒకరికి రియాక్షన్ అవుతుంది. అది నందినికి అయ్యింది. దానితో నందుకి త్వరలోనే గతం గుర్తొస్తుంది. బయపడాల్సిన పని కూడా లేదు’ అంటూ ఈశ్వర్, ప్రసాద్, భవానీల వైపు కోపంగా చూస్తాడు గౌతమ్.
